SRH vs LSG: తొలి ఓటమిని ఎదురుకున్న హైదరాబాద్.. ఖాతా తెరిచినా లక్నో.! 4 d ago

IPL 2025 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో జట్టు SRH పై ఘన విజయం సాధించింది. అటు బాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో లక్నో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. IPL 2025లో హైదరాబాద్ జట్టు తొలి ఓటమిని నమోదు చేసింది.
లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తో బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగింది. దీంతో ఈసారి కచ్చితంగా 300 స్కోర్ వస్తుందని అభిమానులు సంబరపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. శార్దుల్ ఠాకూర్ తను వేసిన రెండవ ఓవర్‌లో అభిషేక్ శర్మ ..ఇషాన్ కిషన్ ను వెంటవెంటనే అవుట్ చేసాడు. అభిషేక్ శర్మ (6) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో ఇషాన్ కిషన్.. తొలి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 15 పరుగులకే సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది.
దీంతో 300 కాదు గదా 200 అయినా కొట్టగలరా అనే పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క వికెట్లు పడుతున్న ట్రావిస్ హెడ్ బాదుడు ఆపలేదు.. తన మెరుపు ఇన్నింగ్స్ వల్లే స్కోర్ బోర్డుపై చెప్పుకోదగ్గ అంకెలు కనపడ్డాయి. నితీష్ కుమార్ రెడ్డి (32)..హెడ్ (47) భాగస్వామ్యంతో SRH జట్టు మరల తిరిగిపుంజుకుంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ (26).. అనికేత్ వర్మ (36) సూపర్ హిట్టింగ్ చేసి..భారీ స్కోర్ అంచనాలను నెలకొల్పారు. కానీ లక్నో బౌలర్లు స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి.. SRH పై విరుచుకుపడ్డారు.
ఆఖరిలో కెప్టెన్ కమిన్స్ 3 సిక్స్‌లు బాదగా.. SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ స్కోరు చేసింది. 4 ఓవర్లలో 34 పరుగులకు 4 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లు దూకుడుగా ఆడారు. మార్క్రామ్ (1) వికెట్ పోయి మొదటి రెండు ఓవర్లు కాస్త నిదానంగా నడిచింది.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. నికోలస్ పూరన్ (70).. మిచెల్ మార్ష్ (52) ఇద్దరు కలిసి SRH బౌలర్లను దంచికొట్టారు.
తక్కువ బంతులకే ఎక్కువ పరుగులు చేసి.. లక్నో జట్టుకు విజయాన్ని ఖరారు చేసారు. అయితే కమిన్స్.. తన వరుస ఓవర్లతో పూరన్, మార్ష్ లను అవుట్ చేసి.. పరుగుల వర్షానికి కళ్లెం వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని (6), రిషబ్ పంత్ (15) స్వల్ప స్కోర్‌కే అవుట్ కాగా.. క్రీజ్‌లోకి వచ్చిన అబ్దుల్ సమద్ (22), డేవిడ్ మిల్లర్ (13) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను కంప్లీట్ చేశారు. అబ్దుల్ సమద్ విరుచుకుపడి ఆడటంతో లక్నో 16.1 ఓవర్లలోనే 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచింది.
అసలు ఈ సీజన్ లో అన్‌సోల్డ్‌గా మిగిలిన శార్దుల్ ఠాకూర్.. 4 భారీ వికెట్లు తీసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. గత మ్యాచ్‌లో 2 వికెట్లు.. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తియ్యడంతో ప్రస్తుతం పర్పుల్ కాప్ ను దక్కించుకున్నాడు.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య చేపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.